etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 17, 2019

కేసు వేస్తామని హెచ్చరిక.. తర్వాత మారిన వర్మ స్వరం

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ఏప్రిల్‌ 11కి ముందు విడుదలయ్యేనా? ఈ విషయంలో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలతో.. చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఒకే రోజు చేసిన విభిన్న ప్రకటనలతో ఈ అనుమానమే కలుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ జరిగే ముందు.. అంటే ఏప్రిల్‌ 11కి ముందు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సెన్సార్‌ దరఖాస్తును పరిశీలించలేమని సెన్సార్‌బోర్డు చిత్ర నిర్మాతలకు రాత పూర్వకంగా తెలిపిందంటూ రాంగోపాల్‌ వర్మ ఆదివారం పేర్కొన్నారు. పైగా సెన్సార్‌ బోర్డు తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా చూడకముందే అందులో ఉన్న విషయం గురించి వారికి ఎలా తెలుసునని… ఓ వర్గానికి కొమ్ము కాయడానికే సెన్సార్‌ బోర్డు ఇలాంటి పనులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా విడుదలను సెన్సార్‌ బోర్డు అడ్డుకుంటోందని.. ఇది చట్టవిరుద్ధమైన చర్య అంటూ మండిపడ్డారు.

బయట వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గి సినిమా చూసేందుకు సెన్సార్‌ బోర్డు విముఖత వ్యక్తం చేస్తోందన్నారు. సినిమాను చూడకుండా వాయిదా వేసే అధికారం సెన్సార్‌ బోర్డుకు లేదని, అలా చేస్తే ఆర్టికల్‌ 19 ప్రకారం తమ భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందన్నారు. సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామని ట్విటర్‌ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ఈ అంశమ్మీద సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తన న్యాయవాది సుధాకర్‌రెడ్డితో కలిసి మీడియా ముందుకు రానున్నట్లు, అప్పుడు సెన్సార్‌ మీద చట్టపరంగా తీసుకోబోయే చర్యల గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే.. రాత్రి 9:30 గంటలకు ఆయన స్వరం మార్చారు. తమ కార్యాలయ అధికారులకు, సెన్సార్‌ బోర్డు అధికారులకు మధ్య సమాచార లోపంతో గందరగోళం నెలకొందని ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ప్రెస్‌మీట్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. సినిమా సెన్సార్‌ పనుల్లో బోర్డు అధికారులు ఉన్నారని ఆయన వెల్లడించారు.

ఈ ప్రక్రియను రెండు మూడు రోజుల్లో చేపట్టనున్నట్లు బోర్డు అధికారులు తమకు తెలిపారన్నారు. మరో దర్శకుడు అగస్త్యతో కలిసి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. మాజీ సీఎం ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. సెన్సార్‌ బోర్డు ఎలాంటి కట్స్‌ చెప్పకుంటే నిర్ణీత షెడ్యూల్‌కు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే బోర్డు కట్స్‌ చెబితే మాత్రం విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

The post కేసు వేస్తామని హెచ్చరిక.. తర్వాత మారిన వర్మ స్వరం appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2TfdDee

No comments:

Post a Comment