ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమ్ము లేపుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలకు… తన పనితీరుతో సమాధానం చెప్తున్నారాయన. నిత్యం ప్రజల మధ్యే, ప్రజలతోనే ఉంటున్నారు జనసేనాని. తన మనసుకు దగ్గరైన వామపక్షాలను కలుపుకునిపోతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తుకోవడం.. ఆయన వ్యూహ చతురతకు నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికే పంపారాయన. కష్టపడుతున్న తమ్ముడికి అన్నయ్య చిరంజీవి సపోర్టుగా ఉంటారా! మెగా ఫ్యాన్స్‌లో, జన సైనికుల్లో ఇప్పుడిదే చర్చ. ఎందుకంటే.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం వెనుక.. పవన్ ఒత్తిడి ఉందని చాలా మంది చెప్తుండేవారు. సమాజాన్ని చదివానని చెప్పుకునే జనసేనాని.. తమను దశాబ్దాలుగా ఆదరిస్తున్న ప్రజలకు ఏమైనా చేయాలంటూ అన్నయ్యను పార్టీ స్థాపనకు ఒప్పించాడని అంటారు. అప్పుడు యువరాజ్యం బాధ్యతలు చూసుకున్నది పవనే. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన ముద్ర ఉంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడం పవన్‌కు ఏమాత్రం ఇష్టంలేదని.. అన్నతో విభేదించారని విస్తృత ప్రచారం జరిగింది. సినిమా ఫంక్షన్లలోను అన్నదమ్ములు కనిపించిన సందర్భాల్లేవు. అయితే.. పరిస్థితుల్లో క్రమంగా మార్పు వచ్చింది. ఓ రోజు అన్నయ్య ఇంటికెళ్లిన తమ్ముడు.. ఇద్దరి మధ్య గ్యాప్ లేదని స్పష్టత ఇచ్చారు. చిరంజీవి కూడా తమ్ముడి సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి తమ బంధం బలంగా ఉందని చెప్పకనే చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా.. బాబాయి జనసేనాని పిలిస్తే.. ప్రచారానికి వెళ్తానంటూ మరో అడుగు ముందుకేశారు. ఈ పరిణామాలు మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపినవే.
మెగా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని.. అందరం ఐక్యంగానే ఉన్నామంటున్నారు… మరో మెగా బ్రదర్ నాగబాబు. అప్పట్లో ప్రజారాజ్యం ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న నాగబాబు.. ఇప్పుడు జనసేనలో చేరారు. నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు కూడా. చిరంజీవి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పరిధిలోని మొగల్తూరు. సొంత సామాజికవర్గం అక్కడ ఎక్కువే. నాగబాబును బరిలో నిలిపిన పవన్ కళ్యాణ్.. ఆ లోక్‌సభ పరిధిలోని భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అంటే.. తాను పోటీ చేస్తున్న ప్రభావం అన్నకు ప్లస్. నాగబాబు ఎఫెక్ట్ తమ్ముడికి అడ్వాంటేజ్. వీళ్లిద్దరూ ఓకే. మరి, మెగాస్టార్ సంగతేంటి? ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. కేంద్రమంత్రి అయ్యారు చిరంజీవి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రచారం చేశారాయన. విభజన ప్రభావం బలంగా ఉండడంతో చిరు సభలకు పెద్దగా స్పందన రాలేదు. మరోవైపు.. అప్పటికే జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఎన్డీఏ కూటమికి మద్దతుగా సభల్లో పాల్గొన్నారు. ప్రచారం చేశారు. అన్నయ్య ఉన్న కాంగ్రెస్ ఒక్క స్థానంలోను గెలవలేక.. డిపాజిట్లు కోల్పోయింది. తమ్ముడు మద్దతిచ్చిన NDA ఘన విజయం సాధించింది. ఆ తర్వాత… చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా కనిపించలేదు. కాంగ్రెస్‌లోనే కాదు.. అసలు రాజకీయాలే తనకు గిట్టవన్నట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలైనా.. చిరు ఎక్కడా కనిపించలేదు. పవన్ మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. కలిసొస్తున్న నేతల్ని చేర్చుకుంటూ… పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ… తాను సైతం పోటీ చేస్తూ.. ముందుకెళ్తున్నారు.
తాను పార్టీ పెట్టినప్పుడు కుడిభుజంలా వ్యవహరించిన తమ్ముడికి.. ఇప్పుడు చిరంజీవి అండగా నిలుస్తారా! ఎందుకంటే.. ఆయన క్రేజ్ వేరు. మెగాస్టార్ ప్రచారం.. కచ్చితంగా జనసేనానికి ప్లస్సే. ఇద్దరు కలిసి ఓ సినిమా కూడా చేస్తారని ఆమధ్య ప్రచారం జరిగింది. తానే సినిమా తీస్తానని సుబ్బిరామిరెడ్డి హంగామా చేశారు కూడా. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. పొలిటికల్ స్క్రీన్‌పైనా మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారా…! రామ్‌చరణ్ కూడా బాబాయ్ కష్టాన్ని షేర్ చేసుకుంటారా? అనేది మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రాజేస్తోంది.
The post జనసేన తరఫున చిరంజీవి ప్రచారం? ఎక్కడెక్కడో తెలుసా …..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FhvTyM



No comments:
Post a Comment