etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 6, 2019

నన్ను కూడా అరెస్టు చేస్తారేమో : చంద్రబాబు

ఎన్నికలకు వారంకూడా గడువు లేదు. కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాపైనే వేటు వేసింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే తొలినిర్ణయం కాదు. ఎన్నికలకు ముందు ఫిర్యాదులు వచ్చిన వారిపై చర్యలకు ఆదేశించడం కొత్తకాదు.. కానీ ఏపీలో జరుగుతున్న పరిణామాలే ప్రజల్లో సందేహాలకు కారణమవుతున్నాయి. ఈనెల 11న పోలింగ్‌ జరగనుంది.. తక్కువ వ్యవధి ఉన్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడా ఝుళిపించింది. సీఎస్ అనీల్ చంద్ర పునేఠాపై వేటు వేసింది. తక్షణమే ఆయన్ను పోస్టు నుంచి తప్పించింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎన్నికల కమిషన్‌ వేటు వేయడం ఇదే మొదటిసారి. ఏపీలో ఎన్నికల నిర్వహణలో పునేఠాకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఎన్నికల కమిషన్‌ ఆయనను బదిలీ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేయడంతో, ప్యానెల్‌ కోసం అడగకుండానే సీనియర్‌గా ఉన్న ఎల్వీని సీఎస్ గా నియమించింది. పునేఠాను ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేని విధుల్లో ఉంచాలని…. శనివారం ఉదయమే LVని బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతకంటే కొద్దిరోజుల ముందు నుంచి ఇప్పటి వరకూ ఏపీలో ఈసీ జోక్యంతో మొత్తం ఆరుగురిపై వేటు పడింది. షెడ్యూలు విడుదలైన తర్వాత సీఎస్ బదిలీతో ఇది నాలుగోది. ఎన్నికల ప్రక్రియ మొదలవకముందే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాను మార్చారు. శ్రీకాకుళం కలెక్టర్‌ను కూడా బదిలీ చేశారు. ఇక ప్రక్రియ మొదలైన తర్వాత మరో ముగ్గురిపై వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును మార్చాలంటూ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. వైసీపీ నాయకులు పదేపదే ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయనను ఎన్నికలతో సంబంధం లేని పోస్టుకు పంపాలని ఆదేశించింది కమిషన్‌. అదే ఉత్తర్వుల్లో కడప, శ్రీకాకుళం ఎస్పీలను కూడా బదిలీ చేయాలని ఆర్డర్ వేసింది. దీంతో సీఎస్‌ పునేఠా ఆ ముగ్గురిని బదిలీ చేశారు.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎన్నికల విధుల నిర్వహణలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ పాల్గొనరని, అందువల్ల ఆయన బదిలీ అవసరం లేదన్న అభిప్రాయం తెరపైకి రావడంతో, నియమ నిబంధనలను పరిశీలించిన పునేఠా తన పాత ఉత్తర్వులను రద్దు చేశారు. వెంకటేశ్వరరావును కాకుండా ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేశారు. ఇదే ఈ ఆగ్రహానికి కారణమైంది. పునేఠా పంపిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఢిల్లీ వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. రెండు రోజుల కింద పునేఠా ఢిల్లీ వెళ్లి కమిషన్‌ ముందు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన పునేఠా ఈసీని కలిసివచ్చిన తర్వాత తన రోజువారీ కార్యక్రమల్లో బిజీగా ఉన్నారు. రెండు రోజులు మౌనంగా ఉన్న ఈసీ శుక్రవారం సాయంత్రం పునేఠాను బదిలీ చేసింది. సీఎస్‌ స్థాయి అధికారిని ఢిల్లీకి పిలిపించడమే అసాధారణ చర్య. మామూలుగానైతే సంజాయిషీ అడిగి సరిపెడతారు. కానీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చిన తర్వాత కూడా పునేఠాపై వేటు వేయడం విస్మయం కలిగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

తాజాగా జరుగుతున్న పరిణామాలపై కొందరు ఇది ఢిల్లీ దండయాత్ర అంటున్నారు. ప్రజల హక్కు అయిన ఓటును తొలగించడానికి కుట్ర చేసిన వారిపై కనీసం విచారణకు కూడా ఆదేశించని ఈసీ.. ఇలా ఎన్నికలతో సంబంధం లేని వారిని బదిలీ చేయడం ఖచ్చితంగా వివక్షకు అద్దం పడుతుందని అంటున్నారు. కడపలో కీలక కేసులో విచారణ జరుపుతున్న అధికారిని మార్చడం.. ప్రతిపక్షాలు ముందురోజు ఫిర్యాదు చేయడం, తర్వాత రోజు ఈసీ చర్యలు అంతా ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతున్నాయంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ పైనా సందేహాలకు తావిస్తుందన్నారు.
అయితే ఇదంతా టీడీపీ ప్రభుత్వం స్వయంకృతాపరాధం అంటున్నారు కమలనాథులు. రాజ్యాంగ బద్ద సంస్థ పరిధిలో ఉందని.. కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని అంటున్నారు.అటు టీడీపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుల ఇళ్లపై ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు చేయడం.. అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడం, తమ ప్రచారాన్ని అడ్డుకోవడం ద్వారా మానసిక స్థైర్యం దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు సైతం తనను అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పడం ద్వారా టీడీపీ పట్ల ఏ స్థాయిలో దండయత్ర జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.

The post నన్ను కూడా అరెస్టు చేస్తారేమో : చంద్రబాబు appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2D0DCkB

No comments:

Post a Comment