etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, April 4, 2019

రాజకీయాల నుంచి తప్పుకున్న బండ్ల గణేష్‌, కారణం ఇదే.

సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌ వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టినవారిని పెద్ద మనసుతో క్షమించమని బండ్ల గణేష్‌ కోరారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత‍్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని బండ్ల గణేష్‌ తెలిపారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తలో హడావుడి చేసిన ఆయన రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా.. అడియాశే అయింది. దీంతో బండ్ల గణేష్‌ డీలా పడటంతో, కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపుల్లో భాగంగా ఆయనకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో బండ్ల గణేష్‌ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు బండ‍్ల గణేష్‌ అతి చేష్టల వల్లే ఆయనను కాంగ్రెస్ కూడా దూరం పెట్టిందని భోగట్టా. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే తన చిరకాల కోరిక అని … ప్రజాసేవ చేయాలనిపించి రాజకీయాల్లో వచ్చినట్టు చెప్పిన బండ్ల గణేష్‌ రాజకీయ ప్రస్థానం కొద్దిరోజుల్లోనే ముగిసినట్లు అయింది.

అయితే బండ్ల గణేష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్‌ చేయడం వెనుక మరేదో… వ్యూహం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌పై చేసిన ట్వీట్‌ అందుకు బలం చేకూరుస్తోంది. ‘నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు….నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ’ బండ్ల గణేష్‌ గురువారం ట్వీట్‌ చేశారు. దీంతో బండ్ల గణేష్‌ గాలి….జనసేనకు మళ్లిందేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మీ ఇష్టదైవం పవన్‌ కల్యాణ్‌ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేరారు అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని సమాధానమిచ్చారు. తనకు పవన్‌ కల్యాణ్‌ తండ్రిలాంటి వారని చెప్పుకొచ్చిన విషయం విదితమే. దీంతో బండ్ల గణేష్‌ …రాజకీయ నిష్క్రమణ వెనుక ఏదో మతలబు ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

The post రాజకీయాల నుంచి తప్పుకున్న బండ్ల గణేష్‌, కారణం ఇదే. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2CZtng7

No comments:

Post a Comment