ఆమె పేరులో రాముడు.. ఆ తల్లి జీవితంలో ఆయనను మించిన కష్టాలు.పురుషోత్తమునికి పద్నాలుగేళ్ల వనవాసం..ఈ ఇల్లాలి జీవితమే కష్టాల సుడిగుండం.వారసుడు కావాలనే భర్త కోరికనిత్య ప్రసవ వేదనను మిగిల్చింది. ఆరుగురు ఆడ..బిడ్డల జన్మకు కారణమైంది. ‘ఆయన’ ఉన్నాడనే ధైర్యంతో..కన్నీళ్లను దిగమింగింది.ఈ ప్రయాణం ఎంతోదూరం సాగకనే..ఆ ‘తోడు’ ఒంటరిని చేసింది.కష్టాలకు ఎదురొడ్డి నిలవలేని భర్తలోకం వీడగా..కంటి పాపల తోడుగా ఆమె..ఒంటరి పోరాటం చేస్తోంది.
నాపేరు హెచ్.రామక్క. బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తికి చెందిన సవారప్పగారి కొల్లప్ప, రామాంజినమ్మలకు నేను రెండో సంతానం. 6వ తరగతి వరకు చదువుకున్నా. పదమూడేళ్ల కిందట గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన హరిజన హనుమంతుతో వివాహమైంది. అప్పటికి నా వయస్సు 18 ఏళ్లు. మొదట ఒక బాబు, పాప చాలని అనుకున్నాం. పెళ్లయిన ఏడాదిన్నరకే మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. లక్ష్మీదేవి అని అందరూ సంతోషించారు. ఆ తర్వాత మళ్లీ పాపే. మూడో కాన్పులో కచ్చితంగా కొడుకు పుడతాడని అందరూ చెప్పడంతో మరో కాన్పుకు సిద్ధపడగా అప్పుడూ ఆడపిల్లే. ఇక చాలని.. వీళ్లనే బాగా చూసుకుందామని నెత్తీనోరు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ‘తాతకు మా నాన్న ఒక్కడే.. మా నాన్నకు నేను ఒక్కడినే. వారసత్వం నాతోనే ఆగిపోతే ఎలా? నాకు కొడుకు కావాల్సిందే’ అని ఆయన పోరు పెట్టాడు. అలా నాలుగో కాన్పులోనూ ఆడబిడ్డే. అప్పటికి ససేమిరా అనడంతో మరో కాన్పుకు వెళ్లగా మళ్లీ అమ్మాయే. ఇక ఆపరేషన్ చేయించుకుంటానని కాళ్లావేళ్లా పడినా.. ఐదుగురి తర్వాత పుట్టేది మగబిడ్డేనని శాస్త్రాలు కూడా చెబుతున్నాయంటూ నమ్మబలికారు. చివరకు ఆరో కాన్పులోనూ ఆడపిల్లే కలిగింది. చిన్న కుటుంబంతో జీవితాన్ని సాఫీగా గడుపుదామని అనుకుంటే.. గంపెడు పిల్లలతో పోషణ భారమైంది.
విధి వెన్నుపోటు
ఉన్నంతలో మా ఆయన ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. స్థానికంగా పనుల్లేక మా అత్త లక్ష్మీదేవిని ఇంటి వద్ద తోడుగా పెట్టి బెంగళూరు, మంగళూరు, తుమకూరు, దావణగెర తదితర పట్టణాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నెలకు రూ.12వేల నుంచి రూ.14 వేల వరకు వచ్చేది. సంసారం ఇలా సాగిపోతుండగా.. బెంగళూరులో కూలి పనులు చేస్తున్న సమయంలో ఆయనపై సిమెంట్ బస్తాలు మీద పడటంతో నడుము దెబ్బతినింది. ఏడాది పాటు మంచం దిగకూడదని వైద్యులుసలహా ఇవ్వడంతో కుమిలిపోయాడు. ఆ సమయంలో కుటుంబ పోషణ భారమైంది. పిల్లల ఆకలి బాధ చూసి ఆయన కలత చెందాడు. దిక్కుతోచని స్థితిలో 2018 జనవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిద్రలేని రాత్రులు
వరుస ప్రసవాలతో అనారోగ్యం పాలయ్యాను. ఇదే సమయంలో భర్త మరణించడంతో దిక్కులేని దాన్నయ్యా. ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వ ఇల్లు మంజూరైనా నిర్మాణ దశలోనే ఆయన మమ్మల్ని వదిలేసి పోయాడు. ఆ తర్వాత సిమెంట్ బస్తా కూడా కొనలేని పరిస్థితి మాది. ఇప్పటికి ఏడాది అవుతోంది. ఆ ఇంటిని అలా వదిలేశాం. బిడ్డల దీనావస్థను తలుచుకొని గడిపిన నిద్రలేని రాత్రిళ్లు ఎన్నో. ఆరుగురూ ఆడపిల్లలే కావడంతో మా జీవితం ఏమవుతుందో తెలియట్లేదు. కూలీ పనులకు వెళ్తూ.. నేను పస్తులుంటూ పిల్లల కడుపు నింపుతున్నా. కూలీ దొరకని రోజుల్లో చుట్టుపక్క ఇళ్లలో బియ్యంలో రాళ్లు ఏరడం, నూకలు నేమడం ఇతరత్రా చిన్నాచితక పనులు చేస్తూ కాలం గడుపుతున్నా. రోజంతా కష్టపడినా రూ.150లు కూడా రాదు. మా అమ్మానాన్న కూడా నిరుపేదలే. వాళ్లను ఇబ్బంది పెట్టలేక నా జీవితం నేను నెట్టుకొస్తున్నా.
తోడుగా పెద్ద కూతురు
పిల్లల పోషణ భారం కావడంతో అనాథ ఆశ్రమంలో చేర్పిద్దామని తెలిసిన వాళ్లతో మాట్లాడినా. ఈ విషయాన్ని బిడ్డలతో చర్చిస్తే ఆకలినైనా భరిస్తాం కానీ, నిన్ను వదిలి వెళ్లమని ఒకటే ఏడుపు. వాళ్ల కన్నీళ్లు నాలో మరో ఆలోచన లేకుండా చేశాయి. కలుగోడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విజయ 8వ తరగతి, శ్రీలక్ష్మి 5వ తరగతి, అను 3వ తరగతి, బేబి 2వ తరగతి చదువుతున్నారు. అవంతిక(6), స్రవంతిక(2) ఇంటి వద్దే ఉంటారు. పెద్ద పాపకు బీటీపీ వద్దనున్న కేజీబీవీలో సీటు వచ్చింది. ఇంటి వద్ద కష్టాన్ని చూసి తట్టుకోలేక నాతోనే ఉంటానని అవకాశాన్ని వదలుకుంది. ఇప్పుడు నాకు కాస్త చేదోడువాదోడుగా ఉంటోంది.
ఓ దారి చూపండి
పింఛను తప్పితే మరో ఆసరా లేదు. నా భర్త చేసినా, నేను చేసినా గంపెడు పిల్లలు కనడం తప్పే. ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. పిల్లల జీవితం గాడిన పడితే అదే పదివేలు. వాళ్లకు మంచి బట్టలు కావాల, మిద్దెలు ఉండాలని అనుకోవట్లేదు. పూటకు ముద్ద అన్నం దొరికి, చదువు చెప్పించగలిగితే చాలనుకుంటున్నా. నా ప్రయత్నానికి సహకరించి దారి చూపాలని వేడుకుంటున్నా.
పేరు : హెచ్.రామక్క
ఊరు : కలుగోడు, గుమ్మఘట్ట మండలం
బ్యాంకు అకౌంట్ : 91029588843,ఏపీజీబీ, గుమ్మఘట్ట
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఏపీజీబీ 00010118
The post 13 ఏళ్ల దాంపత్యంలో వరుస ప్రసవాలు,మగబిడ్డ కావాలనే భర్త కోరికకు జీవితం ఫణం, రామా.. కనవేమిరా! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2LAgbF9



No comments:
Post a Comment