etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 8, 2019

అదే జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు ప్రధాని అయ్యే చాన్స్‌ : ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

కేంద్రంలో ప్రధాని మోదీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడి, ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి ఇవ్వాలన్న ఆలోచన వస్తే అది చంద్రబాబుకు దక్కే అవకాశాలున్నాయని మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ‘‘మోదీ వ్యతిరేక శక్తులను ఏకంచేయడంలో, ఆయనను ఎదిరించడంలో మమత, మాయావతికంటే చంద్రబాబు ముందున్నారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక కూటమి అధికారంలోకి వచ్చి ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి వస్తే… చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. అయితే, టీడీపీ పది లేదా అంతకంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి’’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఇక… పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తనకు ఎన్నో సందేహాలున్నాయని ఉండవల్లి అన్నారు. ‘‘కాఫర్‌డ్యామ్‌నే ఆధారంగా చేసుకుని గోదావరి జలాలను మళ్లిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాల ఉధృతికి రాజమండ్రి నుంచి పోలవరం దాకా కొట్టుకుపోతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి ఉపయోగపడేలా కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని.. పురుషోత్తపట్నం ద్వారా ఎడమ ప్రధాన కాలువ ద్వారా జలాలను విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని… ఇంతలో పోలవరం డ్యామ్‌ నిర్మాణంలో తొందరేమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. పోలవరం డ్యామ్‌ నిర్మాణంలో తన సందేహాలు నివృత్తి చేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదన్నారు. తన సందేహాలను జల వనరుల శాఖ అధికారులు ఎవరైనా తీరిస్తే .. ఇప్పటిదాకా దేవుడిలాంటి వారిని విమర్శించినందుకు క్షమాపణలు చెబుతానని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

అకారణంగా గొడవ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంతో ముఖ్యమంత్రి అకారణంగా గొడవ పెట్టుకుంటున్నారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఎల్వీని ఎన్నికల సంఘం నియమించిందని… ఆయన ఈసీ నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తిస్తారని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున చంద్రబాబు సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుతూ, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ సమీక్షలకు దూరంగా ఉంటే బాగుండేదని అన్నారు. ఈవీఎంలపై సందేహాలను ప్రస్తావిస్తూ… వీవీ ప్యాట్‌ల లెక్కింపులో ఏమైనా పొరపొట్లు దొర్లితే మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఉండవల్లి చెప్పారు. 2014లో ఈవీఎంలతో జరిగిన ఓటింగ్‌తో చంద్రబాబు గెలిచారని ఉండవల్లి గుర్తు చేశారు. అప్పుడు లేని సందేహాలు ఇప్పుడే ఎందుకొస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు.

బాబుపై కేసులు మూడే

చంద్రబాబుపై 17 కేసులున్నాయని రాజకీయ విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, ఆయన 3 కేసులు మినహా అన్నీ కొట్టేయించుకున్నారని ఉండవల్లి చెప్పారు. ఆయనపై వైఎస్‌ విజయలక్ష్మి వేసిన కేసులతో సహా అన్ని కేసులు కొట్టేశారన్నారు. ఇటీవల లక్ష్మీపార్వతి కేసు మళ్లీ బయటకు వచ్చిందన్నారు. ఏలేరు స్కామ్‌తో చంద్రబాబుకు ప్రత్యక్షంగా సంబంధం లేదని… ఇది ప్రభుత్వంపై ఉన్న కేసు అని ఉండవల్లి చెప్పారు.

The post అదే జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు ప్రధాని అయ్యే చాన్స్‌ : ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2H7oT9E

No comments:

Post a Comment