etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 15, 2019

పక్షవాతం రావడానికి 80శాతం ఇదే కారణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.

పక్షవాతం ఓ ప్రమాదకరమైన పరిస్థితి. దీని బారిన పడేవారికే కాదు, వారి కుటుంబ సభ్యులకూ కష్టాలు తప్పవు. అందువల్లే గుండెపోటుకు భయపడనివారూ పక్షవాతం అంటే వణికిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పక్షవాతానికి గురవుతున్నారు. శరీరాన్ని జీవక్రియలు, ఇతర చర్యలకు ముందుకు నడిపించేది మెదడే. ఈ మెదడులో ఉన్న కణాలకు, రక్తనాళాలకు నష్టం జరిగి శరీరంలోని అవయవాలకు, మిగిలిన భాగాలకు రక్తం సరఫరా కాకపోతే శరీరంలో కుడిగానీ, ఎడమవైపుగానీ ఉన్న అవయవాలు చచ్చుబడిపోతాయి. దీన్నే పక్షవాతం అంటారు. శాశ్వతంగా అంగవైకల్యం తప్పదు. ఈ పరిస్థితి ఎదురైన గంటలోపే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.

కారణాలు

శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తం నిరంతరం సరఫరా జరుగున్నట్లే మెదడుకూ రక్తం సరఫరా జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు నశిస్తాయి. రక్త సరఫరాలో అంతరాయాలు ఏర్పడడానికి మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగిన పోషకాలు, ఆక్సిజన్‌ అందకపోవడం. దీనివల్ల ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో వాటి నియంత్రణలో ఉన్న శరీరభాగాలు చచ్చుబడిపోతాయి. మెదడులో కణితులు, రక్తంలో కొవ్వు పదార్థాల వల్ల, మెదడువాపు, ఇతర వ్యాధులవల్ల, గుండెజబ్బుల వల్ల, స్థూలకాయుల్లోనూ పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో హైబీపీ (రక్తపోటు) చాలా సాధారణమైనది.. ఇదే ప్రధానమైనది కూడా. పొగ తాగడం, మితిమీరిన మద్యపానం, డయాబెటిస్‌, ఆహారంలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి, శారీరకంగా తగినంత వ్యాయామం లేకపోవడం, కొంతమందిలో వంశపారంపర్య లక్షణాలు వంటివీ పక్షవాతానికి కారణమవుతాయి.

లక్షణాలు

అకస్మాత్తుగా శరీరంలోని ఒకవైపు సగభాగంపై నియంత్రణ కోల్పోవడం.. ఈ వ్యాధిలో ప్రధానమైన లక్షణం. అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని ‘పక్షవాతం’ (స్ట్రోక్‌)గానే పరిగణించాలి. ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం వల్ల రోగి నిరాశ, నిస్పృహల్లోకి కూరుకపోతారు. ఫిట్స్‌ రావడం, కొన్ని శరీరభాగాల్లో నొప్పి, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోతారు. ఎదుటివారితో సరిగా మాట్లాడలేకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయం అయిపోతారు. ఒకే వస్తువు రెండుగా కనబడటం, దృష్టి మందగించటం, ఏదీ మింగుడు పడకపోవడం, కళ్లు, తల తిరగడం జరుగుతుంది. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, మూతి ఒకవైపునకు వంకర పోవటం దీని కారణాలే. కాళ్లూచేతులూ ఉన్నట్టుండి బలహీనమైపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

నిర్ధారణ

పక్షవాతం వల్ల ప్రభావితమైన మెదడులోని ప్రాంతాలను సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కాన్‌ ద్వారా గుర్తించవచ్చు. రక్తస్రావం జరిగినా, రక్తనాళాల్లో రక్తపు గడ్డలు అడ్డుపడినా ఈ పరీక్షల్లో తెలుస్తుంది. దానిని అనుసరించి చేయాల్సిన చికిత్స, రోగి కోలుకోగలిగే అవకాశాలను నిర్ధారిస్తారు. ఇది ఉందని నిర్ధారణ జరిగితే, దానికి కారణాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం సీబీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్‌ షుగర్‌), క్రియాటినిన్‌ వంటి రక్షపరీక్షలు, ఈసీజీ, టూ- డి- ఎకో వంటి గుండె పరీక్షలు చేయించాలి. అలాగే డాప్లర్‌ నెక్‌ వెసెల్స్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటి పరీక్షలు, మూత్ర పరీక్ష వంటి వాటిని చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఒక రకం ప్రొటీన్లయిన హౌమోసిస్టిన్‌ వంటి వాటిని అంచనా వేసే పరీక్ష, ప్రో-కోయాగ్యులెంట్‌ ఫాక్టర్స్‌ (రక్తం గడ్డకట్టడానికి దోహదపడే అంశాల) పరీక్షలూ చేయించాలి. ఇలా నిర్దిష్టంగా పక్షవాతానికి కారణాన్ని కనుగొంటే, దాన్నిబట్టి చికిత్స చేయడం సులభం. ఒక్కోసారి పక్షవాతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తాత్కాలికంగా కనబడితే… త్వరలోనే మరింత తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోడానికీ ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

చికిత్స

పక్షవాతం లక్షణాలు కన్పించిన 3-4 గంటలలోపు రోగిని నరాలవ్యాధుల నిపుణుల దగ్గరకు తీసుకెళ్లాలి. గంటలోపైతే ఇంకా మంచిది. ఈ సమయాన్ని గోల్డెన్‌ అవర్‌ అంటారు. పక్షవాతం వచ్చిన వారికి థ్రాంబోలైటిక్‌ థెరపీ అనే చికిత్స చేస్తారు. ఈ చికిత్స ప్రక్రియలో టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌ (టీ.పీ.ఏ) అనే ఇంజెక్షన్‌ ఇస్తారు. అది రక్తనాళాల్లో ఉన్న గడ్డను నాశనం చేస్తుంది. మళ్లీ మెదడులోని ఆ భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్‌ ఇస్తే.. ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు బయటపడిన నాలుగు గంటలలోపే ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడంవల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఒకసారి పక్షవాతం రావడం అంటూ జరిగితే ఇక రెండోసారి రాకుండా నివారించడమే దీనికి చికిత్స. ఒకసారి పక్షవాతం కనిపిస్తే రక్తాన్ని పలచబర్చే మందులైన ఆస్పిరిన్‌, క్లోపిడోగ్రెల్‌, రక్తంలో కొవ్వులు పేరుకోకుండా వాడే స్టాటిన్స్‌ వంటి మందులు జీవితాంతం వాడాలి. అయితే రోగికి హైబీపీ, డయాబెటిస్‌ వంటివి ఉంటే ఆ వ్యాధుల మందులూ వాడాలి. కొన్నిసార్లు గుండె సమస్యలు, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా సమస్యలను గుర్తిస్తే, ఆ రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువ అడ్డంకి (బ్లాక్‌) ఉంటే స్టెంటింగ్‌ లేదా శస్త్రచికిత్స అవసరమవుతుంది.

The post పక్షవాతం రావడానికి 80శాతం ఇదే కారణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2T3tTiw

No comments:

Post a Comment