వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని ఈ సినిమా ద్వారా బయటపెట్టనున్నానని వర్మ ప్రకటిస్తుండటంతో సినీ, రాజకీయ వర్గాల్లో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా అప్‌డేట్స్ ద్వారా సంచలనం సృష్టించిన వర్మ.. మొదట ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో సినిమాను విడుదల చేయకూడదని కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.. ఆ డేట్‌లో సినిమా విడుదలను ఆపేయాలని సెన్సార్ బోర్డు వారు ఆదేశించడం జరిగింది. దీంతో సినిమా విడుదలను మార్చి 22 నుంచి 29కి వాయిదా వేయడం జరిగింది. మంగళవారం ఈ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం దుర్మార్గం అని దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు.
‘‘రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. ఆ సినిమా సెన్సార్ చేయరా. ఎవరో వచ్చి అడ్డుకుంటే సినిమా విడుదలను ఆపేస్తారా. ఇది ఏం ప్రజాస్వామ్యం. ఈ సినిమా విషయంలో జరుగుతున్న దుర్మార్గాన్ని మొత్తం మన ఇండస్ట్రీ ఖండించాలి. సినిమా విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. సెన్సార్ బోర్డు ఉంది.. వాళ్లు చెబుతారు సినిమా చూడాలో.. వద్దో అని. ఎన్.టీ. రామారావు గారి మీద ‘మండలాదీశుడు’ సినిమా తీస్తే.. ఆయన ‘మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు.. నన్ను తిట్టిన చూస్తారు’ అని అన్నారు. అది ఆయన గొప్పతనం. అలాగే 1962లో చైనాకి మనకి యుద్ధం వచ్చింది. ఆ సమయంలో నెహ్రూగారిని దేశం మొత్తం తిడుతున్నారు. అప్పుడు ఆర్.కే.నారాయణ గారు నెహ్రూగా విదేశాంగ విధానాన్ని తూర్పారపడుతూ కార్టూన్లు వేస్తే.. అందరూ ఆర్.కే నారాయణగారిని తిడుతుంటే.. నెహ్రూగారు అందరి నోరు మూయించి.. ఆ కార్టూన్లు చూసి.. ‘మిస్టర్ అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది కానీ ఈ కళాకారులు, రచయితలు అంతా ప్రజలపక్షం. మనం వాళ్లు చెప్పింది వినాలి, వాళ్లని గౌరవించుకోవాలి’ అని అన్నారు. అది నెహ్రూ గొప్పతనం. ఇప్పుడు మనం సినిమా తీస్తే.. సెన్సార్ ఆగిపోవడమా..? అందుకు అమరావతికి వెళ్లి వివరణ ఇచ్చుకోవాలా..? ఎవరో చెబితే ఆపేయాలా..? అలాంటప్పుడు సెన్సార్ బోర్డు ఉండి లాభం ఏంటి? సెన్సార్ బోర్డు పాటిస్తున్న ఈ విధానాన్ని ఫిలిమ్ ఛాంబర్ నుంచి ప్రతీ ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలి’’ అని ఆయన అన్నారు.
The post ఎవరో చెబితే ఆపేయాలా ..? ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ఆర్.నారాయణ మూర్తి సపోర్ట్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YaBHmj
No comments:
Post a Comment