ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా రూ.10 మాత్రమే చెల్లించాలని, కోరుతున్న సమాచారానికి సంబంధించి ప్రతీ ఏ-4 సైజ్ పేజీకి రూ.2 మాత్రమే వసూలు చేయాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) స్పష్టం చేస్తోంది. కానీ పరీక్షల సమాధానపత్రాలు కోరితే మాత్రం ఇంటర్ బోర్డు రూ.600 వసూలు చేస్తోంది. ఆర్టీఐ దరఖాస్తు దీనికి సరైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. చట్టం ప్రకారం కోరిన సమాచారం గరిష్ఠంగా 30 రోజుల్లో ఇవ్వాలని, ఇంటర్ ఫలితాల వంటి.. వ్యక్తి జీవితం, స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో అయితే 48 గంటల్లోనే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులు వెలువరించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఆగస్టు 2011లో సీబీఎ్‌సఈ తీరుకు వ్యతిరేకంగా కేసు వేసిన ఇంటర్ విద్యార్థి ఆదిత్య బందోపాధ్యాయ్‌కి రూ.2కే ప్రతిని అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏమైనా అనుమానాలుంటే ఆర్టీఐ ద్వారా తమ పరీక్ష సమాధాన పత్రాలను పొందవచ్చని ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చాలా మంది ఆర్టీఐ కార్యకర్తలు విద్యార్థులకు సూచిస్తున్నారు.
‘‘ఇంటర్, ఎంసెట్ పరీక్షల విషయంలో ప్రతిసారీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకు రావాలి. ఇందుకు ఇప్పటి నుంచే వ్యూహం ఖరారు చేయాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి.. ఆ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేయాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదల తర్వాత తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులను నివారించడం అసాధ్యమేమీ కాదు’’ అని వ్యాఖ్యానించారు.
ఉచితంగా రీ వెరిఫికేషన్.. రీ కౌంటింగ్
‘‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి’’ అని సీఎం ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని నిర్దేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే.. గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని నిర్దేశించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి.. విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. నీట్, జేఈఈ వంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున త్వరగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డికి అప్పగించారు.
ఈ-ప్రొక్యూర్‌మెంట్‌తోనే టెండర్ల ఎంపిక
ఇంటర్ విద్యార్థుల డాటా ప్రాసెసింగ్, పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ద్వారానే టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటుకు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు సీఎంకు నివేదించారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మథించిందని వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్లలో తొలిసారి సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొలి హయాములో నాలుగున్నరేళ్లు పాలించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్‌మీడియట్ విద్యా విధానంపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. తాజా గందరగోళం తర్వాత బుధవారం కేసీఆర్ తొలిసారి దీనిపై సమీక్షించారు. దీంతో, లక్షలమంది విద్యార్థుల భవితవ్యంతో కూడిన ఇంటర్ బోర్డును ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఏటా బోర్డు తీరుపై విమర్శలు వస్తున్నా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
The post ఇంటర్ విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త, అదేంటో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2UA9jXO
No comments:
Post a Comment