ఇది పరీక్షల కాలం. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ జీవిత గమ్యాన్ని, భవిష్యత్తును నిర్దేశించుకునే సమయం. మొన్ననే ఇంటర్మీడియేట్ పరీక్షాఫలితాలు వచ్చాయి. రేపోమాపో టెన్త్ క్లాస్ ఫలితాలు వస్తాయి. విద్యార్థుల్లోనూ, తల్లితండ్రుల్లోనూ ఒకటే టెన్షన్! తొంభై తొమ్మిది శాతం మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులు అవుతారు. ప్రయివేట్ స్కూల్స్ పుణ్యమా అని పత్రికల్లోనూ, టీవీల్లోనూ ప్రచార హోరు మోగిపోతుంది. ప్రతి పాఠశాల యజమాన్యమూ మాదే ఫస్ట్ రాంకు అంటూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తాయి. పత్రికలకు, టీవీ ఛానెల్స్ వారికి నెలరోజుల పాటు కనకవర్షం కురుస్తుంది. అయితే..విచిత్రం ఏమిటంటే..ఈ పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులు తరువాత జరగబోయే పోటీపరీక్షల్లో మాత్రం కుదేలు అవుతుంటారు. వారి ర్యాంకులు వేలల్లో, కొండొకచో లక్షల్లో కూడా ఉంటాయి. నిజంగా నేటి విద్యావిధానం, పరీక్షలు పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందిస్తున్నాయా? డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయినా, నాలుగు వాక్యాలు అటు తెలుగులోనూ, ఆంగ్లంలోనూ తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకిలా? ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాలి. అయిదారు దశాబ్దాలు వెనక్కు వెళ్ళాలి.
ఆ రోజుల్లో మన విద్యావిధానం అంతా తెలుగు మాధ్యమంలో ఉండేది. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. ఐదేళ్లు నిండిన తరువాతనే పాఠశాలలో ప్రవేశం. రెండేళ్లు నిండక పిల్లలకు ఊహ తెలుస్తుంది. మాటలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఇంట్లోనివారు, బంధువులు, ఇరుగుపొరుగువారితో కూడా ఆటాపాటా, కలివిడితనం నేర్చుకుంటారు. తల్లితండ్రులు విద్యావంతులు అయితే వర్ణమాల, నక్షత్రాలు, మాసాలు, రుతువులు, సంవత్సరాలు మొదలైన విజ్ణానదాయకమైన సమాచారం నేర్చుకుంటారు. పెద్దబాలశిక్ష బట్టీయం వేయిస్తారు. కొంతమేర జ్ఞానాన్ని ఇంట్లోనే సంపాదిస్తారు. అప్పట్లో కేవలం ఏడో తరగతి వరకు చదివి కొంతకాలం తరువాత టీచర్స్ ట్రైనింగ్ కు వెళ్లి ఉపాధ్యాయులైనవారు ఎందరో ఉన్నారు. టెన్త్ క్లాస్ తరువాత ట్రైనింగ్ తీసుకుని ఉపాధ్యాయులుగా ఉద్యోగాల్లో చేరేవారు. సంస్కృతాన్ని కూడా ఔపోసన పట్టేవారు. “ఎనిమిదేళ్ల వయసుకే నాతొ పంచకావ్యాలు బట్టీయం వేయించారు మా నాన్నగారు” అని అనేకసార్లు చెప్పారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారిగారు. అప్పట్లో పాఠ్యాంశాలు చాలా ఉన్నతస్థాయిలో ఉండేవి. భారత రామాయణాలు, స్వారోచిష మనుసంభవం, కళాపూర్ణోదయం, మేఘసందేశం, పాండురంగ మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం పాండవరాఘవీయం లాంటి ఉద్గ్రంధాలు టెన్త్ క్లాస్ లోపలే పాఠాలుగా ఉండేవి. ఇక అవే కాక వేమన శతకం, భాస్కర శతకం, సుమతీశతకం లాంటి రచనలు చదివించేవారు. ఈనాటికీ పల్లెల్లో చూడండి. శతక పద్యాలు ధారాళంగా చెప్పగలిగే వృద్ధులు అన్నిచోట్లా కనిపిస్తారు. ఏడో తరగతి మాత్రమే చదివి అష్టావధానాలు చేసినవారు ఉన్నారు. ఇక ఇంటర్ తరువాత కాలేజీల్లో ఆంగ్లమాధ్యమంలో చేరినవారు ఆంగ్ల రచయితలు రచించిన నాటకాలు, కావ్యాలు ఆశువుగా చెప్పగలిగేవారు. “షేక్స్పియర్ నాటకాలు అన్నీ నేను ఆశువుగా చెప్పగలను” అని ఒకసారి ప్రముఖ నవలా రచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు నాతో చెప్పారు.
అంత పటిష్టమైన మన విద్యావిధానం గత ముప్ఫయి ఏళ్లుగా క్షీణదశ వైపు పయనించడం మొదలుపెట్టింది. దీనికి కేవలం ప్రయివేట్ విద్యాసంస్థలు మాత్రమే అనుకుంటే పొరపాటు. మన రాజకీయనాయకులే దీనికి బీజం వేశారు. స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి మన విద్యావ్యస్థను నాశనం చేసారని చెప్పక తప్పడం లేదు. అప్పటివరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పబ్లిక్ పరీక్షా విధానం ఉండేది. ఒకటో తరగతి పాస్ అయితేనే రెండో తరగతికి వెళ్ళేవాళ్ళు. కానీ, బ్రహ్మానందరెడ్డి తెచ్చిన చట్టం పుణ్యమా అని ఏడు, పదో తరగతి మినహా మిగిలిన అన్నీ క్లాసులకు పబ్లిక్ పరీక్షావిధానం పోయింది. ఐదో తరగతి తప్పినవాడు ఏడో ఆరో తరగతిలో నిక్షేపంగా చేరవచ్చు. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినవాడు పదో తరగతికి ఆడుతూ పాడుతూ వెళ్ళవచ్చు. నూటికి డెబ్బై మార్కులు వచ్చినవాడు ఏడు మార్కులు వచ్చినవాడు పై తరగతులకు వెళ్ళవచ్చు. ఈ విధానంతో విద్యార్థులకు చదవాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో యాభై మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తే ఒక్కరికో ఇద్దరికో ఫస్ట్ క్లాస్ వచ్చేది. అయిదారుగురికి సెకండ్ క్లాస్ వస్తే పదిమందికి థర్డ్ క్లాస్ వచ్చేది. మిగిలినవారంతా ఫెయిల్ అయ్యేవారు.
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఆ తరువాత కొన్నాళ్ళకు ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పుస్తకాలు చూసి పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మ్రాన్పడిపోయిన మేధావులు గగ్గోలు పెట్టారు. దాంతో చెన్నారెడ్డి ఆలోచన అటకెక్కింది. అప్పట్లోనే “విద్యార్థుల భవిష్యత్తు” అంటూ ఆందోళన చెందిన ప్రభుత్వం గ్రేస్ మార్కుల విధానాన్ని తెచ్చింది. అంటే కావలసిన పాస్ మార్కులకన్నా, అయిదు మార్కులు తక్కువ వచ్చినా, గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేశారు. నాదెండ్ల ఇచ్చిన గ్రేస్ మార్కులతోనే తాను టెన్త్ పాసయినట్లు ఆ మధ్య ఒక సినిమానటుడు ప్రకటించారు. ఇలాంటి అవకతవక విధానాలతో మన విద్యావ్యవస్థ పూర్తిగా నాశనం అయిపొయింది. అర్హులు కానివారు పైతరగతులకు వెళ్లడం. ఆ తరువాత రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్స్ సాయంతో ప్రతిభావంతులను దాటిపోయి ఉద్యోగాల్లో ప్రవేశించడం మొదలైన విధానాలతో విద్యావ్యవస్థే కాదు, పాలనావ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. అసలీ ముప్ఫయి ఐదు శాతం పాస్ మార్కుల విధానమే లోపభూయిష్టం. ఒక విద్యార్థి ముప్ఫయి అయిదు శాతం మార్కులతో ఉత్తీర్ణుడు అయ్యాడంటే, ఆ తరగతిలో అతను అరవై ఐదు శాతం ఫెయిల్ అయ్యాడనే కదా అర్ధం? అలాంటివాడు పై తరగతులకు వెళ్ళడానికి ఏ విధంగా అర్హుడు?
విడ్డూరం ఏమిటంటే, ఈ విధమైన అడ్డదిడ్డమైన విధానాలను రూపొందించే నాయకుల పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుతారు. మనదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నప్పటికీ వారు అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ లాంటి దేశాల్లో మాత్రమే చదువుతారు. తెలుగు మీడియంలో చదవాలి అని నీతులు బోధలు చేసే మంత్రులు తమ పిల్లలను మాత్రం ఆంగ్లమాధ్యమంలోనే చదివిస్తారు. ఉన్నత విద్యకోసం విదేశాలు పంపిస్తారు. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుస్తారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివించామని ఉపదేశాలు చేసేవారు వారి పిల్లలను మాత్రం లక్షలు ఖర్చు చేసి ప్రతిష్టాత్మక పాఠశాలల్లో చదివిస్తారు. వారికీ తెలుసు..మన స్కూల్స్, కాలేజీలో చదువుకుంటే పరమశుంఠలు అవుతారని!
మన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చెయ్యాలి. పరీక్షల విధానాన్ని సంస్కరించాలి. నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలద్వారా అందించాలి. ముఖ్యంగా డిగ్రీలు కాదు…జ్ఞానం ఇనుమడింపజేసే విధంగా మన విద్యావిధానం ఉండాలి. కావాలంటే మొన్ననే ఇంటర్మీడియట్ తొంభై ఎనిమిది శాతం మార్కులతో పాస్ అయినవారిని శుద్ధమైన ఆంగ్లంలో ఒక లేఖను రాయమని అడిగి చూడండి. వారు ఎంత సిగ్గుపడి మెలికలు తిరుగుతారో తెలుస్తుంది!
Murali Mohana Rao Ilapavuluri
The post పతనమై పోతున్న విద్యావ్యవస్థ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2L2CzH8
via IFTTT
No comments:
Post a Comment