ఆయనో బ్యాంకు ఉద్యోగి. గుప్త నిధులపై ఆశ ఆయనను ఆపద దారుల్లో నడిపించింది. నడమంత్రపు సిరి కోరిక అడవిలోకి అడుగులు వేయించింది. ఎర్రటి ఎండలో నిధుల కోసం మిగతా ఇద్దరితో కలిసి రోజంతా వేట సాగించి, అలసిపోయాడు. దానికితోడు వెంట తీసుకెళ్లిన ఆహారం, నీళ్లు, మజ్జిగ అయిపోయాయి. తట్టుకోలేని ఎండ, తడారిపోతున్న గొంతు! తొందరగా అక్కడినుంచి బయటపడాలని ప్రయత్నించాడు. డస్సిపోయి, కాళ్లు తడబడుతుండగా, ఎక్కువదూరం నడవలేకపోయాడు. అక్కడే కూలబడిపోయాడు. ఆకలి, దాహంతో అలమటిస్తూ ఆ అడవిలోనే ప్రాణాలు వదిలేశాడు. కెనరా బ్యాంకు ఉద్యోగి కట్టా శివకుమార్ జీవితం ఇలా విషాదాంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా పొదిలి సీఐ చిన్న మిరాసాహెబ్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన హనుమంతునాయక్ (70) గుప్తనిధుల కోసం అడవుల్లో తిరుగుతుంటాడు. ఇదే గ్రామానికి చెందిన కృష్ణానాయక్ (40)తో ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామం సమీపంలోని ఓ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనే విషయం చెప్పాడు.
ఆ నిధులు కాటమరాజు కాలంనాటివని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ఒకప్పుడు నక్సలైట్లకు మంచి పట్టున్న ఆ ప్రాంతంలో భారీ డంప్ ఉందని తెలిపాడు. హైదరాబాద్ కెనరా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న కట్టా శివకుమార్(39) ఆ విషయాన్ని కృష్ణానాయక్ ద్వారా తెలుసుకున్నాడు. ఈ నెల 12వ తేదీన వీరంతా తర్లుపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడివారిపల్లికి వెళ్లారు. తాడివారిపల్లి-వెలుగుగొండ అటవీ ప్రాంతంలో.. నందనవనం సమీపంలోని పాత శివాలయ కొలను ఎదుట ఉన్న పాండురంగ స్వామి దేవాలయం వీరి టార్గెట్. మూడు వాటర్ బాటిళ్లు, 15 మజ్జిగ ప్యాకెట్లు, కొన్ని చిరుతిళ్లు వెంటతీసుకుని వెళ్లిన వీరు.. ఆదివారం రాత్రికి అడవిలోకి వెళ్లారు. సోమవారం ఉదయం అడవిలో దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించాక.. భానుడి ప్రతాపానికి విలవిలలాడిపోయారు. వెంట తెచ్చుకున్న నీళ్లు.. మజ్జిగ అయిపోవడంతో.. తాగునీటి కోసం తలోదిక్కు వెళ్లారు. కనుచూపు మేర గ్రామాలు, నీటి జాడ లేకపోవడంతో.. ముగ్గురూ అడవిలో తప్పిపోయారు. ఈ క్రమంలో.. కృష్ణానాయక్‌కు ఓ రోడ్డు కనిపించడంతో.. దాని వెంట వెళ్తూ.. తాడివారిపల్లికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంభం చేరుకున్నాడు.
ముందే చెప్పి ఉంటే..
కృష్ణానాయక్ సోమవారం మధ్యాహ్నానికి కంభం చేరుకున్నా.. అటు హనుమంతునాయక్.. ఇటు శివకుమార్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. వారు అడవిలో తప్పిపోయారనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి ఉంటే.. అదే రోజు అటవీ ప్రాంతంలో గాలింపు మొదలయ్యేది. పోలీసులు శివకుమార్‌ను క్షేమంగా తీసుకువచ్చి ఉండేవారు. బుధవారం సాయంత్రం శివకుమార్ కుమారుడు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. గురువారం మధ్యాహ్నానికి శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. సాయంత్రం వరకు హనుమంతునాయక్ కోసం వెతికారు.
The post గుప్త నిధుల వేటలో ఘోర మరణం..ఇద్దరితో నల్లమలలోకి.. రోజంతా గుప్త నిధుల వేట..చివరికి ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2QdFsUA


No comments:
Post a Comment