నేరుగా మనం ఈ పుస్తకంలోని విషయాలకు వెళ్తే కొంత అయోమయానికి గురి కావలసి వస్తుంది. అందుకే ముందుగా రెండు రకాల ఉపోద్ఘాతాలను ప్రస్తావించుకోవాలి. ముందుగా “అమృత దర్శనం” గ్రంథ రచయిత శ్రీ విశ్వపతి గారి గూర్చి క్లుప్తంగా చెప్పుకుందాం. విశ్వపతిగా ప్రఖ్యాతులు అయిన వీరి పూర్తి నామధేయం తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చేసిన విశ్వపతి గారు కొన్నాళ్ళు ఆల్విన్ సంస్థలోనూ, మరికొన్నాళ్లు ఇంజినీరింగ్ కాలేజీలోని ఉద్యోగం చేశారు. 1998 నుంచి వేదశాస్త్రాల, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా వ్యాపారసంస్థలు పేర్లు నిర్ణయించడం, లోగోలు డిజైన్ చెయ్యడం వృత్తిగా స్వీకరించారు. ఇప్పటివరకు సుమారు ఆరువేల కంపెనీలకు వీరు లోగోలు డిజైన్ చేశారు.
అంతే కాకుండా కొన్నాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో డైలీ కార్టూన్స్ వేశారు. దాదాపు గత ఇరవై ఏళ్లుగా ఆధ్యాత్మిక గ్రంధాలను రచించసాగారు. వీరు రచించిన శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము పన్నెండు భాషల్లోకి అనువదించబడింది. ఇలాంటివే మరో ఇరవై ఆరు పుస్తకాలను వెలయించారు. విదేశాల్లో కూడా వీరి పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. విదేశాల్లోని లైబ్రరీలలో కూడా వీరి పుస్తకాలు చోటు చేసుకున్నాయంటే వీరి ప్రతిభను కొలవడం మనకు సాధ్యం కాదు.
మరో విశేషం ఏమిటంటే…వీరు రచించిన పుస్తకాలన్నీ అమూల్యం. అంటే వీటికి వెల అనేది ఉండదు. అన్నీ ఉచితంగానే లభ్యం అవుతాయి. వారికి ఫోన్ చేసినా, మెయిల్ చేసినా, కొరియర్ లో విశ్వపతిగారే పుస్తకాలను పంపిస్తారు. అలా అని పుస్తక ముద్రణ, నాణ్యత తక్కువేమీ కాదు. ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద నిండైన ముఖచిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి వారి గ్రంధాలు.
విశ్వపతి గారి గురించి ఇంత వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే…పుస్తకాన్ని చదివే పాఠకులు రచయిత విజ్ఞతను, ప్రతిభను, అనుభవాన్ని సందేహించకుండా మాత్రమే. “ఏమిటిదంతా? అసలు ఇలా జరుగుతుందా? ” అనే సందేహాలు వచ్చినపుడు గ్రంధకర్త ప్రొఫైల్ సామాన్యమైనది కాదు అనే విషయం గుర్తుకు రావడానికి మాత్రమే. ఇదే రచన ఇంగ్లిష్ రచయిత ఎవరైనా ప్రచురించి ఉన్నట్లయితే ఈపాటికి అంతర్జాతీయ స్థాయిలో సమీక్షలు, చర్చలు జరుగుతుండేవి. కానీ, విశ్వపతిగారు స్వచ్ఛమైన తెలుగు వారు కదా…అందుకే మనం పెద్దగా పట్టించుకోము.
ఇక పుస్తక విశేషాల్లోకి వెళ్లేముందు మరొక ఉపోద్ఘాతాన్ని చెప్పుకోవాలి. మనం ఏదో విహారయాత్రకు వెళ్తాము. అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు…ఊటీ కావచ్చు..నేపాల్ కావచ్చు..భూటాన్ కావచ్చు…మనం అంతకుముందు ఎన్నడూ చూడని ప్రదేశానికి వెళ్తాము. అకస్మాత్తుగా ఎవరినో చూసి “వీరిని ఎక్కడో చూశామే అనుకుంటాము. కానీ ఎక్కడ చూశామో గుర్తుకు రాదు. అంతలోనే వారు మన దృశ్యగమనం నుంచి మాయమైపోతారు. మామూలుగా వీధుల్లో తిరిగేటప్పుడు కూడా ఎవరినో చూసి మనకు పరిచయస్తులు అని భ్రమపడి వారిని పలకరిస్తాము. తీరా చూస్తే వారు మనం అనుకున్నవారు కారు. మీలో ఎంతమంది ఇలాంటి భ్రమలకు గురి అయ్యారో తెలియదు కానీ, నేను మాత్రం చాలాసార్లు ఎవరినో చూసి ఎవరో అనుకుని పలకరించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
writen by: Murali Mohana Rao Ilapavuluri
The post పునర్జన్మల అనుభూతుల “అమృత దర్శనం” appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2Y3IblI
via IFTTT
No comments:
Post a Comment