etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, July 24, 2019

కౌలు రైతుకు రైతు భరోసా, పంటరుణం, ఇతర ప్రయోజనాలూ…! ఇంకా ….?

రైతుల్లో నాలుగో వంతు రైతులు కౌలుదారులు న్నారు. వారి సంఖ్య ఇంకా ఎక్కువనేది బ్యాంకర్ల భావన. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకునే భూముల కౌలుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు కు ఇచ్చేవారు, తీసుకునే వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు.స్వయం సహాయక సంఘాల్లో భూమి లేని నిరుపేద మహిళలు ఉమ్మడిగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. భూమి యజమాని, సాగుదారుల మధ్య తలెత్తే వివాదాలపై తహసిల్దార్‌ వద్ద అప్పీలు చేసుకునే అధికారం కల్పించారు. తహసిల్దార్‌ ఇచ్చే తీర్పులపై ఆర్‌డీఓ వద్ద అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్డీఓ ఇచ్చే తీర్పులపై అభ్యంతరం ఉంటే జాయింట్‌ కలెక్టర్‌ వద్ద అప్పీలు చేసుకోవచ్చు. అయితే, బ్యాంకులు ఇచ్చే రుణాలను పంటకాలం ముగిసిన వెంటనే సాగదారుడు చెల్లించాలని చట్టంలో పే ర్కొన్నారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా సాగుదారులకు రు ణాలెలా ఇవ్వాలి? రుణాలను చెల్లించకపోతే ఎలా? అన్నదానిపై రూల్స్‌లో స్పష్టతనిచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

బ్యాంకు రుణాలతో పాటు పంట దెబ్బతిన్నా, వర్షాలకు నష్టపోయినా పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి ప్రయోజనాలు సాగుదారుడికి వచ్చేలా బిల్లులో క్లాజులు చేర్చారు. రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కూడా సాగుదారుడికి అందేలా ప్రత్యేక క్లాజు చేర్చారు. బిల్లులో ఇవే కీలకాంశాలుగా ఉన్నాయి. సాగుదారులకు చట్టబద్ధమైన ప్రయోజనాలు పక్కాగా అమలయ్యేలా సమీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్‌ ఏజెన్సీని ప్రతిపాదించారు. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నేతృత్వంలో ఇది ఏర్పాటు కానుంది. కౌలు రైతుల రక్షణకు జిల్లాల వారీగా తీసుకొంటున్న చర్యలపై కలెక్టర్లు విధిగా నోడల్‌ ఏజెన్సీకి నివేదికలు సమర్పించాల్సి ఉంది. వాటి ఆధారంగా చట్టం అమలుపై ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. ఎక్కడైనా సరిగ్గా అమలుకాలేదని గుర్తిస్తే, చర్యలు తీసుకునే అధికారం నోడల్‌ ఏజెన్సీకి అప్పగించారు.

కౌలు రైతుకు మేలు చేసేదిశగా తొలి అడుగు పడింది. భూ యజమానితో సమానంగా వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును సిద్ధం చేసింది. పంట సాగుదారు హక్కుల బిల్లును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2011లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల చట్టం స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. పాత చట్టంలోని అనేక క్లాజులను ఎత్తివేసి, నిబంధనలు, విధానాలను మరింత సులభతరం చేస్తూ ముసాయిదా బిల్లును రూపొందించారు. దీని ప్రకారం కౌలు రైతుల స్థానంలో వారిని పంట సాగుదారులుగా పిలుస్తారు. ఈ మేరకు పంట సాగుదారుల హక్కుల బిల్లుగా దీనికి పేరుపెట్టారు. దీనిప్రకారం, కౌలు స్థానంలో సాగుకోసం భూమి యజమాని, సాగుదారుడు లిఖిత పూర్వక ఒప్పందం చేసుకుంటారు. ఇది రెండు పంట సీజన్‌లకు అంటే ఖరీఫ్‌, రబీలకు చెల్లుబాటయ్యేలా 11నెలల కాలవ్యవధితో ఉంటుంది. ఒకసారి ఒప్పందం కుదిరాక గ్రామ రెవెన్యూ అధికారి కౌంటర్‌ సంతకంతో సాగుదారుడికి హక్కుల కార్డు ఇస్తారు. దీనిపై ఒకవైపు భూమి యజమాని, మరోవైపు సాగుదారుడి పేరు ఉంటాయి.

సాగుచేసే భూమి సర్వే నంబర్‌, విస్తీర్ణం, సరిహద్దుల వివరాలు కూడా దానిపై పొందుపరుస్తారు. గ్రామ సచివాలయంలో జారీచేసే ఈ కార్డుతో సాగుదారులు నేరుగా బ్యాంకులకు వెళ్లి దీన్ని చూపించి పంటరుణాలు తీసుకోవచ్చు. బ్యాంకులు అంతకుమించి మరే ఇతర పత్రాలూ కోరాల్సిన అవసరం లేదని చట్టంలో పొందుపరిచారు. సాగుదారుడికి పంటరుణం ఇచ్చాక, అదే భూమిపై యజమానికి కూడా రుణం కావాలంటే కుదరదు. కౌలుకు ఇవ్వని భూమిపై మాత్రం యజమాని పంటరుణం తీసుకోవచ్చు. ఇంకా, యజమాని భూమికి రక్షణ కల్పించే ప్రతిపాదనలు ఈ చట్టంలో ఉన్నాయి. సాగు ఒప్పంద కాలాన్ని 11నెలలకే పరిమితం చేయడంతో పాటు, సాగుదారుడికి ఇచ్చే హక్కుల కార్డు ప్రతిని యజమానికి కూడా అందిస్తారు. భూమి రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని షరతు పెట్టారు. దీంతో తన భూమి ఎవరి చేతుల్లోకీ వెళ్లదన్న భరోసా యజమానికి కల్పించినట్లవుతుంది. ఇంకా, సాగుదారుడితో ఒప్పందం రద్దు చేసుకోవాలనేకుంటే 2నెలల ముందు నోటీసు ఇస్తే సరిపోతుంది.

The post కౌలు రైతుకు రైతు భరోసా, పంటరుణం, ఇతర ప్రయోజనాలూ…! ఇంకా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/32QDQpu

No comments:

Post a Comment